10 లక్షల కోట్ల ఉద్దీపన కావాలి

కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించటంతో అన్నిరకాల వ్యాపారాలు, పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిశ్రమలు మళ్లీ నిలబడాలంటే దేశంలో ఎన్నడూ ఎరుగనంత భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని ఫిక్కీ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థను మళ్లీ నిలబెట్టాలంటే పరిశ్రమలకు రూ.9నుచి 10లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అవసరమని పేర్కొంది. భారత జీడీపీలో ఇది 4-5శాతం ఉంటుందని అంచనావేసింది.


కరోనా ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రపంచంలోని అన్నిదేశాలూ ఇలాంటి ఉద్దీపనలను ప్రకటిస్తాయని అభిప్రాయపడింది. భారత జీడీపీలో అప్పుల శాతం తక్కువగానే ఉన్నందున ఈ మేరకు ప్యాకేజీ ప్రకటించటం కష్టమేమీ కాదని ఫిక్కీ రూపొందించిన నివేదికలో తెలిపింది.


ఆర్థిక వ్యవస్థలో కింది నుంచి పై స్థాయి వరకు అన్నిచోట్లా ఉపమశమన, పునరుద్దరణ ప్యాకేజీల ద్వారా నిధులను విరివిగా సమకూర్చవల్సి ఉంటుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలతోపాటు అసంఘటిత రంగంలోని ప్రజలకు కూడా ఉద్దీపన అందించవలసి ఉంటుంది అని ఫిక్కీ పేర్కొంది.