లండన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు వేడుకలు రాష్ట్రంతో పాటు విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్‌లో ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ యూకే ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ 66వ బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షులు అశోక్‌ గౌడ్‌ దూసరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా నిర్మించే క్రమంలో భగవంతుడు సీఎంకు అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్నిచ్చి, తన ఆశీస్సులతో ముందుకు నడిపించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాక్షులు నవీన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు కన్న కలల్ని సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారని నవీన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌, మాజీ ఎంపీ కవిత, యావత్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు.. ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ను అత్యంత ప్రోత్సహిస్తున్నారనీ,వారికి ఈ సందర్భంగా కృతజతలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.